కాళోజి మొగ్గలు

తెలంగాణ పోరాటానికి ఆయువుపట్టు అవుతూనే
అస్తిత్వ ఉద్యమానికి శంఖారావాన్ని పూరించినవాడు 
కోటిరత్నాల తెలంగాణను మీటిన ధిక్కారస్వరం కాళోజి

నిత్యం అన్యాయం అక్రమాలపై గళమెత్తుతూనే
దోపిడీవర్గాలపై సమరశంఖాన్ని పూరించినవాడు
నిజాం నిరంకుశపాలనపై మోగిన దండోరా కాళోజి

మన భాషకు మన యాసకు పట్టం కడుతూనే
పలుకుబడుల భాషకు ప్రాణం పోసినవాడు
తెలంగాణ భాషనే నిజమైన భాష అన్న కాళోజి

అధర్మాలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే
నీతిని నిజాయితిని ఇంటిపేరుగా చేసుకున్నవాడు
నిఖార్సయిన తెలంగాణ ప్రజాకవి కాళోజి

జీవితమంతా నిత్యపోరాటం సలుపుతూనే
ప్రజాసేవలోనే నిరంతరం మునిగి తేలినవాడు
అసలైన ప్రజాస్వామ్య జీవగొంతుక కాళోజి

పదాల పిడుగులను అక్షరతూటాలుగా పేలుస్తూనే
తెలంగాణ కవితా గాండీవాన్ని మోగించినవాడు
నిజాం నిరంకుశాన్ని ఎండగట్టిన కలంయోధుడు కాళోజి

చైతన్యం నింపే కలం సిరాచుక్కకు ప్రాణం పోస్తూనే
మోడువారిన లక్షల మెదళ్ళను కదిలించినవాడు
సమసమాజాన్ని కాంక్షించిన చైతన్యగీతిక కాళోజి

ప్రజాస్వామ్య ఉద్యమాలకు వేగుచుక్క అవుతూనే
దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించినవాడు
నిజాన్ని నిర్భయంగా చాటిన డోలుదెబ్బ కాళోజి

బ్రతుకంతా తెలంగాణ కోసమై పోరాడుతూనే
సామాజిక రాజకీయ ఉద్యమాన్ని నడిపినవాడు
తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమ ధ్వని కాళోజి

ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాడుతూనే
తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించినవాడు
తెలంగాణలో పొడిచిన తొలిపొద్దు కాళోజి

              – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone